ఆశలురేపి అకస్మాత్తుగా మూతపడిన ఐదు భారతీయ విమానయాన సంస్థలు, ఎందుకిలా జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో వైమానిక రంగం ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది. కొత్త విమానయాన సంస్థలు వస్తుండేవి. ఫ్లైట్ ఎక్కడం అందరికీ సాధ్యమవుతుందని జనం అనుకునేవారు.
కొన్ని విమానయాన సంస్థలు విలాసవంతమైన సేవలను గొప్పగా చెప్పుకుంటే, మరికొన్ని సంస్థలు చౌకగా టిక్కెట్లు అనే కల గురించి చెప్పేవి.
కానీ ఆ కథ కొద్దిరోజుల్లోనే మారడం మొదలైంది.
పెరుగుతున్న అప్పులు, ఖరీదుగా మారిన ఇంధనం, తప్పుడు నిర్ణయాలు...ఇవన్నీ విమానయాన సంస్థలను నింగి నుంచి నేలకు దించేశాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లగ్జరీ విమానాలైనా, గోఫస్ట్ చౌక విమానాలైనా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫెయిల్యూర్ స్టోరీ. ఇక్కడ నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, ఆకాశాన్ని జయించడం అంత ఈజీ కాదు.


ఫొటో సోర్స్, Getty Images
1. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దగ్గరున్న సమాచారంప్రకారం, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఆపరేటింగ్ పర్మిట్ 2003 సంవత్సరంలో జారీ అయ్యింది.
పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఖర్చులు, తగ్గుతున్న టిక్కెట్ల ఆదాయం తదితర కారణాలు సంస్థకు నిరంతర నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ సంస్థ వేల కోట్ల రూపాయల అప్పులలో కూరుకుపోయింది.
ఎయిర్ డెక్కన్‌ను కొనుగోలుచేసి, అంతర్జాతీయ మార్గాల్లో వేగంగా విస్తరిస్తున్నప్పటికీ లాభాలను ఆర్జించలేకపోయింది.
పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, కంపెనీ ఉద్యోగులకు జీతాలుగానీ, బ్యాంకులకు రుణాలనుగానీ సకాలంలో చెల్లించలేకపోయింది. విమానాల రద్దు మొదలైంది.
చివరికి, భద్రతా, ఆర్థిక కారణాలను చూపుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 2012 అక్టోబర్ 20వ తేదీన ఈ కంపెనీకి అనుమతులను రద్దు చేసింది.
లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం, డీజీసీఏ చీఫ్ 2012 అక్టోబర్ 2న ఆ విమానయాన సంస్థ సీఈవోతో సమావేశం నిర్వహించారు. కానీ ఎటువంటి ఫలితమూ సాధించలేదు.
దీని తరువాత కూడా విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి కింగ్‌ఫిషర్ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోవడంతో, ఆ కంపెనీ కోలుకోలేక పోయింది.
కింగ్‌ఫిషర్‌కు ఆ పరిస్థితి రావడానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కూడా కారణమని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. జెట్ ఎయిర్‌వేస్
జెట్ ఎయిర్‌వేస్ తన కార్యకలాపాలను 1993, మే 5వ తేదీన ఎయిర్-టాక్సీ సర్వీస్‌గా ప్రారంభించింది. ఆ సమయంలో, కంపెనీ నాలుగు బోయింగ్-737 విమానాలను లీజుకు తీసుకుని నడిపేది.
1995 జనవరిలో దీనికి షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ హోదా లభించింది. అంటే, ఇప్పుడు ఇది సాధారణ ప్రయాణికుల విమానాలను నడపొచ్చు.
2000ల ప్రారంభంలో జెట్ ఎయిర్‌వేస్ వేగంగా అభివృద్ధి చెందింది. దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది.
2004లో, ఇది చెన్నై నుంచి కొలంబోకు తన మొదటి అంతర్జాతీయ విమానాన్ని ప్రారంభించింది.
2005లో ఈ కంపెనీ ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యింది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దగ్గరున్న సమాచారం ప్రకారం, 2018 మార్చిలో కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది. వరుసగా నాలుగు త్రైమాసికాల పాటు ఇది నష్టాల్లో ఉంది. దీనివల్ల దాని నగదు నిల్వలు తగ్గిపోయాయి, సంస్థను నడపడం కష్టమైంది.
ప్రభుత్వం ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకులు కంపెనీని కాపాడటానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. ఆర్‌బీఐ ‘ప్రాజెక్ట్ శక్తి’ కింద ఈ ఎయిర్‌లైన్ కోసం ఒక రిజల్యూషన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.
కానీ జెట్ ఎయిర్‌వేస్ భాగస్వామి ఎతిహాద్, భారతీయ బ్యాంకులు ఒక ఒప్పందానికి రాలేకపోయాయి. 2019 మార్చి నాటికి, పరిస్థితి చాలా దారుణంగా మారింది. నిధుల కొరత కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి.
ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, 2019 ఏప్రిల్ 10న కంపెనీ అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్‌వేస్ తన అన్ని విమానాలను నిలిపివేసింది.
ఆ తర్వాత బ్యాంకులు కొత్త యజమాని లేదా మేనేేజ్‌మెంట్ కోసం బిడ్లను ఆహ్వానించాయి. కానీ వారికి సరైన బిడ్ రాలేదు.
ప్రతి విమానయాన సంస్థ దాని సొంత బిజినెస్ ప్లాన్‌లను తయారు చేసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిధుల సేకరణ, కార్యకలాపాల నిర్వహణ కంపెనీ బాధ్యత. ఏ ప్రైవేట్ విమానయాన సంస్థకైనా నిధుల సేకరణలో తమ పాత్ర ఏమీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Reuters
3. గో ఎయిర్
2005 నుంచి పనిచేస్తున్న గోఎయిర్ చౌకగా సర్వీసు అందించే విమానయాన సంస్థ. దీనికి 2021 మే నెలలో గోఫస్ట్‌గా పేరు మార్చారు.
ఈ కంపెనీ 2023 మే నెలలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దివాలా ప్రక్రియలోకి వెళ్లాలనుకుంటున్నట్లుగా ఈ విమానయాన సంస్థ పేర్కొంది.
ఈ సంస్థ 2010-2021 మధ్య కాలంలో 8.38 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి, భారతదేశంలో మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది. ఆ సమయంలో, ఇది వారానికి 2,290 విమానాలను నడిపేది.
2009 నుంచి 2018 వరకు నిరంతరం లాభాలను ఆర్జించినట్లు, 2019-20లో కూడా తమ వద్ద మిగులు ఉందని ఈ సంస్థ వెల్లడించింది.
ఈ విమానయాన సంస్థ ప్రకటించినదాని ప్రకారం, దాదాపు 7,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మరో 10,000 మంది వరకూ పరోక్షంగా దీనిపై ఆధారపడి ఉన్నారు.
లేహ్, పోర్ట్ బ్లెయిర్ వంటి క్లిష్టమైన విమానాశ్రయాలకు కూడా సేవలందిస్తున్నామని, జమ్మూ కశ్మీర్‌లో తమది అతిపెద్ద విమానయాన సంస్థ అని ఆ సంస్థ ప్రకటించుకుంది.
2022లో తమ చెల్లింపులలో తేడాలు మొదలయ్యాయని కంపెనీ పేర్కొంది. వాణిజ్య భాగస్వాములు, లీజర్ల నుంచి పదే పదే నోటీసులు అందుకుంది.
ఇంజిన్‌లో సమస్యలు ఎక్కువ కావడంతో ఈ సంస్థ విమానాలు చాలావరకు ఎగరడానికి వీలులేకుండాపోయాయి. మొత్తం 54 విమానాలలో 28 విమానాలు నిలిచిపోయాయని వెల్లడించింది.
ఒప్పందం ప్రకారం ఇంజిన్ తయారీదారు ప్రాట్ అండ్ విట్నీ మరమ్మతులు చేయలేదని, కొత్త ఇంజిన్లను అందించలేదని ఎయిర్‌లైన్ ఆరోపించింది.
కేవలం 30 రోజుల్లోనే 4,118 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల 77,500 మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని ఎన్‌సీఎల్‌టీకి నివేదించింది.
ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం, 2024 ఆగస్టులో, గో ఫస్ట్ కోసం తయారు చేసిన రెస్క్యూ ప్లాన్‌ను రుణ బ్యాంకుల కమిటీ తిరస్కరించింది.
తదనంతరం, 2025 జనవరి 20న, గోఫస్ట్‌ను లిక్విడేషన్ చేయాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. దీనర్ధం, కంపెనీ తన అప్పులు తీర్చడానికి ఆస్తులను అమ్ముకోవాలి.
ఈ ఆర్డర్‌తో, 17 సంవత్సరాలకు పైగా నడిచిన గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ కథ ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎయిర్ డెక్కన్
ఎయిర్ డెక్కన్‌ను జి.ఆర్.గోపీనాథ్ స్థాపించారు. భారతీయులకు కేవలం ఒక రూపాయి లేదా అంతకంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తానని ఆయన చెప్పారు.
దీనిని డెక్కన్ ఏవియేషన్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట నడిపేవారు.
ఈ కంపెనీ 1997లో చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది.
ప్రారంభంలో, హెలికాప్టర్లను మాత్రమే లీజుకు తీసుకుంది. 2003 ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభంలో బెంగళూరు-హుబ్లి మార్గంలో ఒక చిన్న ఏటీఆర్ విమానాన్ని నడిపింది.
ఆ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, 2006 మార్చి నాటికి, 41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. రోజుకు 226 విమానాలను నడుపుతూ, 52 విమానాశ్రయాలకు నెట్‌వర్క్‌ను విస్తరించింది.
సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ దగ్గరున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2006లో ఇది దాదాపు 14 శాతం మార్కెట్ వాటాను సంపాదించింది. 2,410 మంది ఉద్యోగులతో భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్‌గా అవతరించింది.
చిన్న, తక్కువ జనాభా కలిగిన పట్టణాలను పెద్ద నగరాలతో అనుసంధానించడం ఈ ఎయిర్‌లైన్ లక్ష్యం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, ఆ సమయంలో దేశంలో దాదాపు 450 విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే పెద్ద జెట్ విమానాలకు సర్వీస్ ఇవ్వగలిగేవి.
అటువంటి పరిస్థితిలో, డెక్కన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణం కోసం ఏటీఆర్ వంటి చిన్న టర్బోప్రాప్ విమానాలను ఉపయోగించింది. తర్వాత నెట్‌వర్క్‌ను విస్తరించింది.
సెంటర్ ఫర్ ఏవియేషన్ ప్రకారం, 2007లో, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ డెక్కన్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసి, దాని బ్రాండ్‌ను సింప్లిఫై డెక్కన్‌గా మార్చింది.
2008లో, దీనిని మళ్లీ రీబ్రాండ్ చేసి, సింప్లిఫై డెక్కన్‌ను కింగ్‌ఫిషర్ రెడ్‌తో విలీనం చేశారు. కానీ, అప్పటికే మొదలైన కష్టాలు తగ్గలేదు.
కొన్నేళ్ల విరామం తర్వాత, ఎయిర్ డెక్కన్ డిసెంబర్ 22, 2017న ప్రభుత్వ ఉడాన్ (యూడీఏఎన్) ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించింది.
కోవిడ్ కారణంగా ఎయిర్‌లైన్‌ను నిరవధికంగా మూసివేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో అరుణ్ కుమార్ సింగ్ 2020 ఏప్రిల్‌లో ప్రకటించారు.

ఫొటో సోర్స్, Paramount Airways
5. పారామౌంట్ ఎయిర్‌వేస్
ప్రయాణికులకు సరసమైన ధరలకు బిజినెస్ క్లాస్ సేవలను అందించే లక్ష్యంతో "న్యూ జనరేషన్ ఎంబ్రేయర్ 170/190 సిరీస్" విమానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి విమానయాన సంస్థ ఇది.
సెంటర్ ఫర్ ఏవియేషన్ దగ్గరున్న సమాచారం ప్రకారం, 2005 అక్టోబర్ నుంచి ఈ కంపెనీ విమాన సర్వీసులను ప్రారంభించింది.
లగ్జరీ విమానాలను లీజుకు తీసుకుంది. కానీ లీజు చెల్లింపులపై డిఫాల్ట్‌లు, వివాదాలు ఎయిర్‌లైన్, లీజింగ్ కంపెనీల మధ్య లీగల్ కేసుకు దారితీశాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, బ్యాంకుల కన్సార్షియానికి ఆ కంపెనీ రూ.400 కోట్లకు పైగా బకాయిపడింది.
ఈ సమస్యలు లీజింగ్ కంపెనీలు దాని విమానాలను స్వాధీనం చేసుకునేందుకు దారితీశాయి. దీంతో మొత్తం విమానాలన్నీ నిలిచిపోయాయి.
2010లో తన అన్ని విమానాలను నిలిపివేసింది పారామౌంట్ ఎయిర్‌వేస్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














