తిరుపతి: ‘జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు’

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశాకు చెందిన విద్యార్థినిపై ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి వెస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఆ ప్రొఫెసర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
పోలీసులకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు.
‘అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ వర్సిటీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది, దాని ఆధారంగా అంతర్గత దర్యాప్తు చేస్తే లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిల ఫోన్లలో విద్యార్థినికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి’ అని రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాటిని డిలీట్ చేశామని, ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తు చేయాలని.. విద్యార్థినికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ఆమెను బెదిరించారని శుక్లా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వర్సిటీలోని 'యాంటీ సెక్సువల్ హెరాస్‌మెంట్ కమిటీ'కి బాధితురాలు నవంబర్ 24న ఫిర్యాదు చేస్తూ లేఖ ఇచ్చారు.
అనంతరం, వర్సిటీ డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు అంతర్గత విచారణ జరిపింది.
డిసెంబర్ 6న, బాధితురాలి తరఫున వర్సిటీ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో వర్సిటీ ఆలస్యం చేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.


'చర్యలు తీసుకోలేదు'
ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుండగా, మరోవైపు వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
చదువుకోవడానికి వచ్చిన యువతిపై ఇద్దరు ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, దీనిపై వీసీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన ఓబుల్ రెడ్డి ఆరోపించారు.
''లక్ష్మణ్ అనే ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని, ప్రాక్టికల్ మార్కులు తగ్గించకుండా ఉండాలంటే, చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నారని విద్యార్థిని చెప్పారు. శేఖర్ రెడ్డి అనే మరో ప్రొఫెసర్ ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. దీనిపై నవంబర్ 24న వీసీకి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించకుండా, బయటకు రానీయకుండా తొక్కిపెట్టారు. విద్యార్థి సంఘాలనూ లోపలికి అనుమతించడం లేదు'' అని ఓబుల్ రెడ్డి ఆరోపించారు.
విద్యార్థిని వేధించిన ఇద్దరిని సస్పెండ్ చేస్తే సరిపోదని, భవిష్యత్తులో అధ్యాపకులు ఎవరూ ఇలాంటి వేధింపులకు పాల్పడకుండా వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
''ప్రొఫెసర్లను సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని, ఎంక్వైరీ వేయాలి. ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలి'' అని ఓబుల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇద్దరు ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఎన్ఎస్‌యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ హెచ్చరించారు.
''విద్యార్థినిని వేధించిన లక్ష్మణ్ కుమార్‌ను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేయలేదు, విద్యార్థి సంఘాలు శనివారం వచ్చి ఆందోళన చేసే వరకు ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేయడం కాదు వాళ్లకి కఠిన శిక్ష వేయాలి'' అని అన్నారు.
ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి : తిరుపతి ఎంపీ
వర్సిటీ అంశంపై పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చామని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బీబీసీతో చెప్పారు.
''విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశాన్ని సోమవారం పార్లమెంటులో వాయిదా తీర్మానం మూవ్ చేశాం. సభలో ఒడిశా కాంగ్రెస్ ఎంపీల నుంచి కూడా మద్దతు లభించింది. ఘటనను వారు ఖండించారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టాం. కానీ, వందేమాతరంపై చర్చ ఉండటంతో ఈ అంశంపై చర్చ జరపడం కుదరలేదు'' అని అన్నారు.
''ప్రాక్టికల్స్ మార్కుల పేరుతో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటం చూస్తుంటే తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో వేదాలు నేర్పించే సంస్కృత విద్యాపీఠంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు, సాధారణ కాలేజీల పరిస్థితి ఏంటి అనిపిస్తోంది?. ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి'' అని గురుమూర్తి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook
ఒడిశాకు ప్రత్యేక బృందం: ఏపీ హోంమంత్రి
ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిపై తిరుపతి ఎస్పీతో మాట్లాడిన మంత్రి, నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ప్రకటించారు.
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, తిరుపతి ఎస్పీ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె చెప్పారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు, ఇతర కీలక సమాచారం సేకరించేందుకు ఒక ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఒడిశాకు పంపించామని, బాధితురాలికి న్యాయం చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని హోంమంత్రి చెప్పారు ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, కేసు దర్యాప్తును వేగవంతం చేసి, బాధితురాలికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు.
ఈ కేసుపై మరింత సమాచారం కోసం యూనివర్సిటీ దగ్గరకు బీబీసీ తెలుగు వెళ్లింది. వీసీని కలిసి మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ, అదే సమయంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండటంతో మీడియాను లోపలికి అనుమతించలేదు.
వీసీ కృష్ణమూర్తిని కలిసి మాట్లాడాలని బీబీసీ పలుమార్లు ప్రయత్నించినా ఆయన అనుమతించలేదు.
అదే సమయంలో తిరుపతి వెస్ట్ డీఎస్పీ భక్తవత్సల రెడ్డి కూడా యూనివర్సిటీలో ఇదే కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కేసు పురోగతి తెలుసుకుందామని బీబీసీ ఆయనకు కూడా పలుమార్లు ఫోన్ చేసింది.
వర్సిటీ వీసీ, పోలీసులు కేసు పురోగతి గురించి సమాచారం ఇవ్వగానే అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














